పాకిస్తాన్ లో 18 ఏళ్లు దాటితే వ్యాక్సిన్..

పాకిస్తాన్ లో 18 ఏళ్లు దాటితే వ్యాక్సిన్..
  • విదేశాలకు వెళ్లే వారికి మాత్రమే
  • ప్రైవేటుగా ఒక్కో డోసు 80 డాలర్లు వసూలు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం 18 ఏళ్ల వారికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. అయితే తరచూ విదేశాలకు వెళ్లి వచ్చే వారికి లేదా వెళ్లే వారికి మాత్రమే ఈ సౌకర్యం ప్రస్తుతానికి అందుబాటులో ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది.  వర్క్ వీసాపై విదేశాలలో పనిచేస్తున్న పాకిస్తానీలు, విదేశాలలో చదువుతున్న విద్యార్థులు, ఓడలలో సముద్ర యానం చేసే వారు.. మత్స్యకారులు తదితరులు తమ వృత్తి సంబంధిత ఆధారాలు చూపించి కరోనా కేంద్రాలలో ఉచితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. 
విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేవారు, కార్మికులు, చదువుకునేందుకు వెళ్ళే విద్యార్థులు, ఉద్యోగులు తదితర విభాగాలకు చెందిన వారు ఉచిత వ్యాక్సిన్ దొరక్క ఇబ్బందిపడుతున్నారని, ఒక వేళ వేయించుకుందామని వెళ్లినా.. కోవిడ్ కేంద్రాల వద్ద భారీ క్యూల వల్ల ఒకటి రెండు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కాదని ప్రైవేటుగా వేయించుకుందామంటే ఒక్కో వ్యాక్సిన 80 డాలర్లు చెబుతున్నారు. రెండు డోసులకు 160 డాలర్లు చెల్లించే స్థోమత లేదని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పాకిస్తాన్‌లో 40 ఏళ్ళు దాటినవారికి అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌,18 సంవత్సరాలు దాటినవారికి సినో ఫార్మా, కాన్‌సినో, సినోవాక్‌ ఇస్తున్నారు. అస్ట్రా జెనెకా వేసుకున్న వారికి  రెండో డోస్‌ 12 వారాలకు ఇస్తున్నారు. సినో ఫార్మాకు 3 వారాలు, సినోవాక్‌కు నాలుగు వారాలకు రెండో డోస్‌ ఇస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్లు వేసుకున్న యువతకు సౌదీ అరేబియా దేశం అనుమతి ఇవ్వడం లేదు. ఫైజర్‌, మోడెర్నా, అస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న యాత్రికులనే సౌదీలోకి అనుమతిస్తున్నారు. దీంతో సౌదీకి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులకు ఇబ్బంది ఎదురవుతోంది. ఈ నేపద్యంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇస్తూ  దీంతో వీరందరూ వీసా చూపించి ఏ వ్యాక్సినేషన్‌ సెంటర్‌లోనైనా వ్యాక్సిన్‌ వేసుకోచ్చని స్పష్టం చేసింది.